A Flash of Light, A Lifetime of Void

                                  

నేను, నా చెల్లి... మా మధ్య దాపరికాలు లేని లోకం అది. ప్రతీ సంతోషం, ప్రతీ బాధ... ముందుగా పంచుకునేది నాతోనే. నా దృష్టిలో తను కేవలం చెల్లి కాదు, నా మొదటి బిడ్డ! తనని అంతలా ప్రేమగా చూసుకునేదానిని. పెళ్లైన మూడేళ్లకు తను Pregnant అని నిర్ధారణ అయిన  రోజు, మా ఆనందానికి హద్దులు లేవు. ఆ పసిబిడ్డ కోసం తను ఎంతగానో కలలు కంది! Pregnancy సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుండి, బిడ్డను ఎలా పెంచాలి అనే వరకూ... ప్రతీ క్షణాన్ని, బేబీ కిక్స్‌తో సహా, రికార్డు చేసుకునేది. "బేబీ పెద్దయ్యాక, తన కోసం ఎంత ఎదురుచూశానో చూపిస్తా అక్కా!" అంటూ చెప్పేది.

చూస్తుండగానే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. డెలివరీ కోసం నేను ఫ్లైట్‌లో బయలుదేరి, నాన్నతో కలిసి హాస్పిటల్‌కి వెళ్తుంటే... దారిపొడవునా ప్రతి దేవుడినీ వేడుకున్నాం. ముఖ్యంగా, నాన్న.. డెలివరీ హాయిగా జరగాలని, తన కూతురు క్షేమంగా ఉండాలని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నారు. కూతుళ్ళంటే ఆయనకు అంత పిచ్చి ప్రేమ. నేను హాస్పిటల్‌ చేరుకోగానే, కేవలం రెండు నిమిషాల్లో "బేబీ బాయ్!" అన్నారు డాక్టర్లు. వాడిని  మొదటిసారి చూసిన క్షణం కళ్లల్లో నీళ్లు ఆగలేదు. నా చేతుల్లో పెరిగిన చెల్లి ఇప్పుడు తల్లిగా మారింది. వానికి "చిట్టి తండ్రి! నీకు దివ్య లాంటి అమ్మ దొరకడం నీ అదృష్టం" అన్నాను. నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన చెల్లికి డెకరేషన్‌తో సర్ప్రైజ్ ఇచ్చాము. మా ఇల్లు ఆనందంతో నిండిపోయింది. వాడి బారసాల గురించి అర్ధరాత్రి వరకు మాట్లాడుకున్నాము. తన కొడుకుని ఎలా పెంచాలి అన్న  తన మాటలు ,తన కళలు అందరికంటే ముందే నాతో పంచేసుకుంది. మా ఆ సంతోషాన్ని, మా అనుబంధాన్ని చూసి... భగవంతుడికి కూడా కన్ను కుట్టిందేమో!

మరుసటి రోజు... మా ఇంటికి ఎవరో నర దృష్టి సోకినట్టుగా... నా చెల్లి Paralysis తో  కుర్చీలో పడిపోయింది. డాక్టర్లు బ్రెయిన్ హెమరేజ్, బ్రతకడం కష్టం, 50-50 అన్న మాటలు మా కాళ్ల కింద భూమి ఒక్కసారిగా పాతాళంలోకి కుంగిపోయినట్టు అనిపించింది. ఆ క్షణంలో మాకు, మా ముందు శూన్యం తప్ప ఏమీ కనిపించలేదు.. "ఒక శాతం అవకాశం ఉన్నా... మేము దాన్ని వదులుకోము!" అని ధైర్యంగా చెప్పాము. బయట మేము పోరాడుతుంటే, లోపల అది బ్రతకడం కోసం మమ్మల్ని మించి పోరాటం చేస్తుంది. ఆ కష్టకాలంలో, మా అందరికీ బ్రతకడానికి ఒకే ఒక ఆశ: "దాని సంకల్ప బలం!" అది తిరిగి వస్తుందనే నమ్మకమే...అందరి కళ్లల్లోని భయాన్ని తుడిచేస్తూ,  అది మృత్యువును కూడా జయించి ఇంటికి వస్తుంది అని నేను అందరికి ధైర్యం నూరి పోసేదానిని. 
పగలు రాత్రి అయ్యేది కాదు, రాత్రి పగలు అయ్యేది కాదు. ఆరు నెలల కాలం ఒక అంతులేని వేదనలా, దీర్ఘ నిరీక్షణలా సాగింది. మా మనసు, శరీరం రెండూ అలసిపోయినా, నమ్మకం మాత్రం నలుసు అంత కూడా  తగ్గలేదు.ఆరు నెలలు... మా శరీరాలు ఇంట్లో ఉన్నా, మా ప్రాణం మాత్రం ఆ ఐసీయూ గది బయటే పడిగాపులు కాసింది. 

నా చెల్లి వచ్చేస్తుంది అనుకునే ప్రతిసారీ, భగవంతుడు మాతో యుద్ధం చేస్తున్నాడనిపించింది, దాన్ని మా దగ్గరికి రానివ్వకుండా. ఇంక రెండు రోజులే దాని సమయం అని తెలిసినప్పుడు, మా జీవితాలు అక్కడే ఆగిపోయాయి. దాని జ్ఞాపకాలన్నీ ఒక మెరుపులా కళ్ల ముందు కదిలాయి. మా జీవితాల్లోకి ఒక మెరుపులా వచ్చి, మరుక్షణంలో అలానే మాయమైపోయింది నా బంగారం. చెల్లి జ్ఞాపకాలతో మేము బతుకుతుండగానే... అనూహ్యంగా ఇంకో చావు మా ఇంట్లో! చెల్లి వెళ్లిపోయాక మాకు ధైర్యం చెప్పిన నాన్న, ఈ బ్లాగ్ మొదటి పేజీని చదివి, "ఆఖరి పేజీ కోసం ఎదురుచూస్తాను" అన్న నువ్వు... నా ఆఖరి అధ్యాయం చదవకుండానే వెళ్లిపోయారు. నా గుండెల్లో, నా జ్ఞాపకాల్లో, నా ఊపిరిలో... మిగిలిన మీ ఇద్దరూ. మీ జ్ఞాపకాలే ఇప్పుడు మా జీవితాలు.
ఆ ఆరు నెలల పోరాటం... జీవితం నాకు నేర్పిన అతి పెద్దపాఠం. మా చెల్లి, నాన్న దూరమయ్యారు, కానీ వారి నవ్వు, ధైర్యం నా ప్రతి శ్వాసలో మిగిలి ఉన్నాయి. ప్రేమకు, జ్ఞాపకాలకు మరణం లేదు అని అర్థమైంది. అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడే, ఎవరు మనవాళ్ళు మరియు ఎవరు కాదు అనేది అర్థమైంది. కష్టకాలంలో మన పక్కన నిలబడేవారే నిజమైన బంధువులు. రేపటి రోజు గ్యారెంటీ లేని ఈ జీవితంలో, నిన్నటి జ్ఞాపకాలను, నేటి క్షణాలను పూర్తిగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ శూన్యం... నన్ను కుంగదీయలేదు. నా చెల్లి కథ బయటకు రావాలి, నాన్న జ్ఞాపకాలు లోకానికి తెలియాలి అనే బలమైన సంకల్పాన్ని నాలో నింపింది. కోల్పోవడం ఒక అంతం కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి పునాది.

🕊️ ముగింపు:

ప్రియమైన నా నాన్న మరియు చెల్లి కు,

మీరు లేని ఈ లోకంలో ప్రతి ఉదయం  సూర్యుడు ఉన్నా చీకటిగానే ఉంది. మీరు నా జీవితంలోకి మెరుపులా వచ్చి, నా లోకానికి వెలుగునిచ్చారు. కానీ ఆ మెరుపు ఇంత త్వరగా మాయమైపోతారని నేను ఊహించలేదు.

నా జీవితంలో అన్నీ మీరే  నా ధైర్యం, నా అండ, నా ప్రపంచం.. నేను తప్పు చేస్తే సరిదిద్ది, గుండెల్లో పెట్టుకుని చూసుకున్నది మీరే. నా సంతోషాన్ని పంచుకున్న ప్రతిసారీ, నా ఆనందానికి అతి పెద్ద చీర్‌లీడర్‌లు మీ ఇద్దరే. నా జీవితంలో అన్నీ మీరే.మీరిద్దరూ నా జీవితానికి ఆధారం. మీరు లేకుంటే, నా జీవితమే లేదు.

నాన్న... మీ భరోసా నాకు ఇప్పటికీ గుర్తుంది: "మీకు ఏమైనా కష్టం వస్తే, ముందు ఆ కష్టానికి అడ్డు గోడగా నేను ఉంటాను," అనేవారు నాన్న.

చెల్లి... నువ్వు చెప్పిన మాటలు: "నేను నీతో ఎప్పటికి  ఉంటాను అక్కా, నీకేం కావాలన్నా నేను ఉన్నాను, అన్ని మర్చిపోకు." నీకు నొప్పిగా ఉన్నా కూడా, నన్ను చూసి నువ్వు ఇచ్చిన ధైర్యం నేను మర్చిపోలేను.

నా  జీవితానికి భరోసా ఇచ్చిన మీరిద్దరూ... ఇప్పుడు నాతో ఇంకా లేరు అనే నిజాన్ని దిగమింగుకుంటూ, మీ జ్ఞాపకాల్లో పయనిస్తున్నాను. ఇక ముందు జీవితం ఎప్పటిలా ఉండదు అని తెలిసినా, ఎదో ధైర్యం... మీరు నా పక్కనే ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది.

మీరు దూరమైనా,"ఎప్పటికి మీ ఈ జ్ఞాపకాల్లో మిగిలిన నేను..."




Comments

Popular posts from this blog

Two Blossoms, One Root

The Beginning Of our Story- Journey of our footsteps 👣