A Shared Shadow, A Separate Sun
మన జీవితంలో కొన్నిసార్లు ఊహించని మలుపులు వస్తాయని, వాటికి సమాధానాలు దొరకవని ఆ రోజు నాకు అర్థమైంది. ఒక క్షణం భయం, మరుక్షణం ఆదుర్దా... ఆ పసి హృదయం దారితప్పి ఒక కొత్త స్నేహాన్ని ఎలా తెచ్చిందో . అమ్మ రిక్షా లో వస్తుందేమో అనుకుని బయటకు వెళ్ళిన నా చెల్లి, దారి తప్పి, పిల్లలు లేని ఒక ఆవిడ దగ్గరకు చేరింది. ఆవిడ ప్రేమతో చెల్లిని తీసుకెళ్తున్నప్పుడు నాన్న చూసి, ఆ భయంకరమైన క్షణాన్ని ఒక అద్భుతమైన బంధంగా మార్చారు. చెల్లిని కాపాడిన ఆవిడని నాన్న ఎప్పటికీ మర్చిపోలేదు. చెల్లి కూడా ఆవిడని ప్రేమగా "మేకత్త" అని పిలవడం, ఆవిడ మా ఇద్దరినీ ప్రాణంగా చూసుకోవడం... ఆ బాధ, భయం నుంచి పుట్టిన ఆ బంధం ఒక గొప్ప ఆశీర్వాదం.
ఒక కొత్త ప్రపంచం: హిరమండలం
ఆ సంఘటన తర్వాత, మన కథ హిరమండలంలో మొదలైంది. ఒక కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. ఇంతవరకు చూడని పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో, ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు కింద, ఇంటి పక్కన విశాలమైన ఆడుకునే స్థలంలో మా జీవితం మొదలైంది. అక్కడ నాన్న అంటే అందరికీ గౌరవమే కాదు, ఎనలేని భయం కూడా. ఒక నాయకుడిలా ఆయన మాటంటే అక్కడ శాసనం. మా చదువు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీపడలేదు. ఉత్తమమైనది ఇవ్వాలని రెండు నెలల పాటు స్కూల్స్ గురించి ఆరా తీశారు. మా ఇద్దరికీ ప్రతీ విషయంలోనూ ఆయన అత్యుత్తమమైనది ఇచ్చారు.
ఆగస్టు 15న మా స్కూల్‌కి నాన్న జడ్జిగా వచ్చారు. ఆయన చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మేమిద్దరం మాకోసమే అనుకున్నాం. కానీ ఆయన ఆ బహుమతులను బాగా చదివే విద్యార్థులకి, ఆటల్లో, డిబేట్స్‌లో గెలిచిన వారికి ఇచ్చారు. ఇంటికి వచ్చాక నాన్నను నిలదీశాం, "మాకు ఎందుకు ఇవ్వలేదు?" అని. "నేను ఇంట్లో మీకు నాన్నను, స్కూల్‌లో ఒక జడ్జిని. బాగా చదివేవాళ్ళకు ప్రోత్సాహం ఉంటుంది. మీరు బాగా చదివితే అలాంటి బహుమతులు మీకూ వస్తాయి" అని ఆయన ఇచ్చిన సమాధానం మాకు ఒక గొప్ప పాఠం.
ఆ మాటలతో చెల్లిలో పట్టుదల పెరిగింది. తర్వాతిసారి నాన్న జడ్జిగా వచ్చినప్పుడు, డిబేట్‌లో మొదటి బహుమతి గెలుచుకుని, ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఆ రోజు చెల్లి కళ్ళలో మెరిసిన ఆనందం అమూల్యం. అలా సరదాగా గడిచిపోయాయి హిరమండలం రోజులు.
కాలం గడిచిపోయింది. నేను హైస్కూల్ దశకు చేరుకున్నాను.
నా చదువు గురించి తీవ్రంగా ఆలోచించిన నాన్న,
శ్రీకాకుళంలో ఒంటరి ప్రయాణం,
నన్ను శ్రీకాకుళంలో జాయిన్ చేసారు.అదొక కొత్త ప్రపంచం... పరిచయం లేని గోడలు, భయం కలిగించే క్రమశిక్షణ,ఎక్కడా కనిపించని అమ్మ, నాన్న.. స్కూలు గేటు దగ్గర నుంచున్ననేను . నా హృదయం ఆ భారాన్ని తట్టుకోలేకపోయింది.
"నేను ఇక్కడ ఉండను! మీరు లేని చోట నేను ఉండలేను!" అంటూ ఆ స్కూలు గేటు దగ్గర నాన్నని పట్టుకుని బోరున ఏడ్చాను.సాధారణంగా నాన్నలు ధైర్యంగా ఉండి, "ఏడవకు, అలవాటవుతుంది" అని చెప్పేవారేమో. కానీ, నా కన్నీళ్లు చూసి నాన్న గుండె కరిగిపోయింది
హాస్టల్‌లో వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నా, నా బాధను చూడలేక ఆ నిర్ణయాన్ని వెంటనే మార్చుకున్నారు. నన్ను ఏకాకిని చేయకుండా, ఎనిమిది నెలల పాటు, మా అనుకునే మా మనుషులు అంటే మా బాబాయ్ ఇంట్లో సురక్షితంగా, ఆప్యాయతతో కూడిన వాతావరణంలో ఉంచారు.నాన్న చేయి పట్టుకుని కొత్త ప్రపంచంలో అడుగు పెట్టాను. కానీ, ఆ కొత్తదనంలో కూడా చెల్లి జ్ఞాపకం నన్ను వెంటాడేది. ఇంట్లో ఆమె అల్లరి, కేరింతలు లేకుండా ఉండటం... అదే నాకు మొదటిసారి. ఆ ఖాళీ స్థానం నన్ను కొత్త ప్లేస్‌కి అడ్జస్ట్ అవ్వడానికి చాలా కాలం పాటు ఇబ్బంది పెట్టింది.
కొన్ని రోజులకి ఆ కొత్త వాతావరణం, అల్లరి చేసే కొత్త స్నేహాలు సావాసం అలవాటైంది. అంతలో నాన్నకి శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్. జీవితం మరో కొత్త మలుపు తిరిగింది.
ఇంట్లో వాతావరణం... ప్రేమతో పాటు, క్రమశిక్షణకు మారుపేరు. అమ్మ చాలా స్ట్రిక్ట్, చదువు విషయంలో నాన్న కూడా అంతే కఠినంగా ఉండేవారు. ఆ నిబంధనల చట్రంలోనే నా బాల్యం గడిచింది.
చూస్తుండగానే... జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పదో తరగతి వచ్చేసింది. ఒక్కసారిగా అంతా మారిపోయింది. నాపై ప్రెషర్ విపరీతంగా పెరిగింది. ఇంట్లో, స్కూల్లో... ఎక్కడ చూసినా ఒకటే మాట: "బాగా చదవాలి! మంచి మార్క్స్ రావాలి!"
ఆ ఒత్తిడికి కారణం కేవలం నా భవిష్యత్తే కాదు. నా తర్వాత ఉన్న చెల్లికి నేను ఆదర్శంగా ఉండాలనే బాధ్యత కూడా తోడైంది. "నిన్ను చూసి తను ఇంకా బాగా చదువుతుంది" అనే మాట... నన్ను ఒత్తిడికి గురి చేసినా, లోలోపల నాకో గొప్ప లక్ష్యాన్ని గుర్తుచేసింది.
ఆ క్షణం అర్థమైంది... నా జీవితం ఇక నా ఒక్కరిదే కాదు, నా బాధ్యత నా వెనుక ఉన్న చెల్లికి దారి చూపడం కూడా అని. ఆ బాధ్యతే నన్ను మరింత కష్టపడి చదివేలా చేసింది.
అది నాకు ఇష్టం అనే కంటే... పిచ్చి ప్రేమ అంటేనే సరైనది. పోట్లాట మా బంధం, ప్రేమ దాని పునాది. దూరంగా ఉంటే తట్టుకోలేము, దగ్గర ఉంటే పోట్లాడకుండా ఉండలేము... మా ఇద్దరి బంధం అలాంటిదే!
చదువుల ప్రయాణం ముగిసింది. నా స్కూలింగ్ పూర్తైంది. నా వెనుక నా అడుగుజాడల్లో నడుస్తూ... నా ప్రాణం వంటి చెల్లి కూడా చదువులో పరుగులు తీయడం మొదలుపెట్టింది. అదో అద్భుతం! ఏ విషయం చెప్పినా, ఎంత కష్టమైన సబ్జెక్టు అయినా, క్షణాల్లో అర్థం చేసుకునే ఆ తీరు చూసి మురిసిపోయేదాన్ని.
అంతా బాగానే ఉంది. కానీ, ఇంట్లో... మా ఇద్దరి మధ్య పోట్లాటలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోయాయి. అల్లరి, అరుపులు, అలకలు... మా రోజువారీ దినచర్యలో భాగమయ్యాయి.
అలాంటి సమయంలో, అనుకోకుండా అది పది రోజుల స్కూల్ ట్రిప్‌కి వెళ్ళింది. ఇంట్లో ఆ పది రోజులు... ఒక్కసారిగా అన్నీ స్తంభించిపోయినట్లు అనిపించింది. దాని అల్లరి లేదు, దానితో పోట్లాడే అవకాశం లేదు. ఆ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది... దానితో పోట్లాడకుండా, దాని గోల లేకుండా నా రోజు గడవదని.
ప్రతి నిమిషం... అది ఎప్పుడు వస్తుందా అనే ఎదురుచూపు. నా మనసు అల్లరి చేస్తూ, 'త్వరగా రా చెల్లి' అంటూ గట్టిగా అరుస్తోంది.
అది తిరిగి వచ్చింది. మళ్లీ మా పోట్లాటలు మొదలయ్యాయి. కానీ... ఎంత అల్లరి చేసినా, దాన్ని ఎంత తిట్టినా... దాని కళ్లల్లో ఒక్క కన్నీటి బొట్టు చూసినా నేను తట్టుకునేదాన్ని కాదు. దాని ఏడుపు చూస్తే, తెలియకుండానే నా కళ్లలో నీళ్లు తిరిగేవి.
Story Continues next week....
నాన్న, అమ్మ ఇద్దరూ నన్ను ధైర్యంగా ఉండమని చెప్పినా, ఆ రోజు నా ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.నన్ను పట్టుకుని ఏడుస్తున్న దాని కళ్ళల్లో నేను చూసిన వేదన, భయం... అది కేవలం అక్క దూరమవుతోందన్న బాధ కాదు. తన అల్లరి ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోతోందన్న ఆందోళన.మా ఇద్దరి బంధంలో అంత దూరం అప్పుడే మొదలైంది.
ఆ దూరం... మా బంధాన్ని విడదీసిందా? లేక మరింత బలంగా మార్చిందా?
ఆ కన్నీళ్లకు అసలు కారణం ఏమిటి?

Comments
Post a Comment