When Life Takes a New Turn
నానమ్మ కన్నీళ్లు: హాస్టల్ గోడల వెనుక
శ్రీకాకుళం రోజులు ముగియగానే, నా చదువుల ప్రయాణం వేరే మలుపు తీసుకుంది. EAMCET రాసి, కౌన్సెలింగ్‌లో సీటు కోసం నాన్నతో కలిసి ఎదురుచూసిన క్షణాలు అవి. ఎట్టకేలకు, నాన్న, నేను కలిసి తీసుకున్న ఆ కీలక నిర్ణయం, ఇంటికి చాలా దూరంగా ఉన్న ఒక యూనివర్సిటీలో చేరడం. అది కేవలం చదువు కోసం కాదు, నాన్న దృష్టిలో అది నా భవిష్యత్తుకు వేయబోతున్న బలమైన పునాది.
ఆ రోజు నా జీవితంలో మరో వీడ్కోలు. స్కూల్ గేటు దగ్గర భయంతో నేను ఏడ్చినప్పుడు నాన్న గుండె కరిగింది. కానీ, ఈసారి నా భవిష్యత్తు కోసం ఆ వేదనను భరించక తప్పలేదు. నాన్న, అమ్మ నన్ను హాస్టల్‌లో వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ రోజు మా అందరికన్నా ఎక్కువ బాధపడింది నానమ్మ.
నన్ను గట్టిగా పట్టుకుని, నానమ్మ ఏడ్చింది. "అంత దూరం ఎందుకురా పంపిస్తున్నారు? చిన్నపిల్ల... ఒంటరిగా ఎలా ఉంటుంది?" అంటూ కన్నీళ్లతో నాన్నను బతిమాలింది. ఆ ముఖంపై కనిపించిన నిస్సత్తువ నా గుండెను దహించింది. నానమ్మ కళ్ళలో నేను చూసిన ఆ నిస్వార్థ ప్రేమ నన్ను హాస్టల్ గోడల మధ్య కూడా వెంటాడే ఒక దీపమైంది.
నాకంటే ఎక్కువ కుంగిపోయింది చెల్లి. నేను దూరమవుతున్నానంటే, దాని అల్లరి ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోతుందని దానికి తెలుసు. నన్ను పట్టుకుని ఏడ్చిన దాని వేదన... ఇప్పటికీ ఆ గుండెభారాన్ని నేను మోస్తున్నాను. ఇక మా పోట్లాటలు లేవు, అల్లరి లేదు. ఆ వియోగం మా బంధాన్ని కరిగించిందా, లేక కొత్త శక్తిని ఇచ్చి, మమ్మల్ని మరింత దగ్గర చేసిందా?
నేను హాస్టల్ గదిలో అడుగుపెట్టాను. అది కేవలం నాలుగు గోడల గది కాదు, పరిచయం లేని మొహాలు కనిపించే ఒక కొత్త ప్రపంచం. కోరుకున్న స్వేచ్ఛ మనసులో ఒక మూల ఉన్నా, ఆ స్వేచ్ఛ వెనుక ఎదో తెలియని భయం నన్ను చుట్టుముట్టింది. నేను పూర్తిగా కుంగిపోతున్న ఆ క్షణంలోనే, ఎప్పుడూ లేని విధంగా నాన్న నా దగ్గరకు వచ్చారు.
ఆయన కళ్లల్లో భారం, గొంతులో మమకారం నిండి ఉన్నాయి. నా భుజంపై చేయి వేసి, నాన్న మెల్లగా అన్నారు:
“తల్లి , ఈ నాలుగు గోడలే నీకు నిజమైన జీవితం అంటే ఏంటో నేర్పుతాయి. నువ్వు ఎప్పుడూ గూటిలో ఉన్న పక్షిలా ఉండేదానివి. ఇక్కడ నుండే నువ్వు రెక్కలు విప్పుతావు. మనం వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేసుకోవాలి. నువ్వు ఒక్క తప్పు అడుగు వేసినా, అది నీ చదువుకే కాదు... మన పెంపకానికి కూడా ఒక గుణపాఠం అవుతుంది. గుర్తుంచుకో తల్లీ ఎందుకంటే నువ్వు మా భవిష్యత్తు.”
నాన్న నా జీవితంలో ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. అది నేను తప్పటడుగు వేస్తాను అనే భయమో, లేక 'మా కూతురు' అనే గౌరవాన్ని నిలబెట్టాలనే క్రమశిక్షణో... ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. కానీ, ఆ మాటలు నా ఒంటరి గదిలో ఒక దీపంలా నిలిచిపోయాయి. నాన్న చెప్పిన ఆ పాఠం నన్ను కదిలించింది.
నన్ను హాస్టల్‌లో చేర్చాక, నాన్న, అమ్మ బయలుదేరారు. నేను వారిని చూడకుండా, తలవంచుకుని గదిలోకి వెళ్లిపోయాను. కానీ, నా మనసు ఊరుకోలేదు. వారు గేటు దాటుతున్నప్పుడు... కిటికీలోంచి చూశాను.
మా అమ్మ కళ్ళల్లో కూడా కన్నీళ్లు. అమ్మ ఎప్పుడూ కఠినంగా, క్రమశిక్షణతో ఉండేది. అలాంటి అమ్మ కళ్ళల్లో ఆ బాధను చూడటం అదే మొదటిసారి. నాన్న కూడా గుండె బరువుగా నడుస్తున్నట్లు అనిపించింది. ఆ క్షణం అర్థమైంది. నా భవిష్యత్తు కోసం వారు తీసుకున్న ఈ నిర్ణయం నాకెంత బాధో, వారికీ అంతే బాధ అని.
అమ్మ , నాన్న వెళ్లిపోయారు. ఆ హాస్టల్ గోడల మధ్య నేను ఒంటరిగా మిగిలిపోయాను. నానమ్మ ప్రేమ, చెల్లి బాధ, అమ్మ ఆశీర్వాదం ,నాన్న ఇచ్చిన నమ్మకం... ఇవన్నీ నన్ను ఆ ఒంటరి పోరాటానికి సిద్ధం చేశాయి. నాన్న కలలు, నా బాధ్యత... ఈ రెండు భారాలు మోస్తూ నేను చదువుల లోకంలోకి అడుగుపెట్టాను.
next chapter to be continued...
నిజంగా, మనమంతా ఎదురుచూసే కొన్ని రోజులుంటాయి. మన రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటారు. ఆ రోజు మనపై చూపించే ఆ ప్రత్యేకమైన ప్రేమ, ఆ అప్యాయత... అదొక అపూర్వమైన అనుభూతి..నేను మీతో పంచుకునే ఆ అనుభూతులు..

Very well explained about ( FATHER & BONDING BTWN DAUGHTER AND HER FUTURE )
ReplyDelete