The Beginning Of our Story- Journey of our footsteps 👣

 

మన బాల్యం మొదలైన ఊరుఆమదాలవలస  

ఆ పేరు వినగానే నా పెదాలపై ఒక చిరునవ్వు, గుండె లోపల ఒక లోతైన భావన. ఆ ఊరి మట్టి రోడ్లు, వాటి పక్కన ఉండే పచ్చని చెట్లు... ఇవన్నీ కేవలం మట్టి కాదు, అవి మన చిన్ననాటి అడుగుజాడలు.   

నువ్వు, నేను.. మన జీవితాల్లోకి వచ్చిన అపురూపమైన,అమాయకమైన మనుషులు  . వాళ్ళు మనపై చూపించిన మమకారం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనివి. నాన్న ఎప్పుడూ చెప్పేవారు,ప్రతి బంధం రక్తం తోనే కాదు కొన్ని బంధాలు మనసులతో ముడిపడి కూడా ఉంటాయి అని ఆయన ఆ మాట ఎందుకు అన్నారో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇప్పటి కాలం లో ఇలాంటి బంధాలు చాలా  అరుదు. 

దివ్యా, నీకు గుర్తుందా? మన బాల్యం ఎంత స్వచ్ఛంగా, ఎంత అద్భుతంగా గడిచిందో! 

మన చిన్ననాటి స్కూల్ బంక్ ప్రణాళికలు అంటే... అవి కేవలం క్లాస్ ఎగ్గొట్టడం కోసం కాదు, అవి నువ్వు,నేను   కలిసి చేసిన అతి పెద్ద అల్లరి.

ప్రతి ఉదయం స్కూల్‌కి బయలుదేరేటప్పుడు నువ్వు నా చేతిని పట్టుకుని అడిగే ఆ ఒక్క ప్రశ్న... "అక్కా, నువ్వు నాతోనే వస్తావు కదా?" ఆ మాటల్లో ఉన్న భయం కన్నా, నాపై నువ్వు ఉంచిన నమ్మకం నాకు బాగా గుర్తొస్తుంది. అది కేవలం ఒక ప్రశ్న కాదు, నా బాధ్యతకు, నా ప్రేమకు అది ఒక గుర్తు.

ఒక రోజు నువ్వు నన్ను నవ్వకుండా, ఏదో తెలియని బెంగతో నీ తరగతిలోకి వెళ్లిపోయావు. అది నాకు ఏదో కీడు జరుగుతుందని చెప్పినట్టుగా అనిపించింది. నేను నీ తరగతిలోకి తొంగిచూసినప్పుడు... నువ్వు లేవు! నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయింది. నా ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. "మా చెల్లిని ఎవరైనా చూశారా?" అని నేను అరిచిన అరుపులు, భయం తో పరుగులు తీసిన క్షణాలు నా జీవితంలో అత్యంత భయంకరమైనవి.

సాయంత్రం ఇంటికి వెళ్లినప్పుడు, నాన్న కోపం, అమ్మ కన్నీళ్లు...అన్నీ నన్ను భయపెట్టాయి. "నీ చెల్లిని వదిలేసి ఎలా వచ్చావు?" అని నాన్న బెల్టుతో కొట్టినప్పుడు ఆ నొప్పి నా చేతికి కాదు, నా గుండెకు తగిలింది.

అదే సమయంలో, నాయనమ్మ మార్కెట్ నుండి ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న తరువాత ఆమె మాట ఒక్కసారిగా  మూగబోయింది . ఆ తర్వాత నాన్న స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీసినప్పుడు, ఆయన "ఇది మా బాధ్యత కాదు, మీ కుటుంబ వ్యవహారం" అని చెప్పిన మాట నాన్న కళ్లలో కోపాన్ని, గుండెలో పగని నింపింది.

నాన్న నిన్ను వెతుకుతూ ప్రతి వీధి, ప్రతి మూల వెతికారు. చివరకు నిన్ను ఒక ఆవిడ దగ్గర చూసి, నాన్న కళ్లలో ఆనందం, భయం, ప్రేమ...అన్ని కలిసినట్టు అనిపించింది. "ఇది మా ప్రాణమమ్మా" అంటూ నాన్న ఆవిడ కాళ్ళ దగ్గర మోకరిల్లి నిన్ను అడిగిన క్షణం నా హృదయాన్ని మెలిపెట్టింది. ఆవిడ కళ్ళలో నీళ్ళతో "ఆ చిన్నపాప పైన ఉన్న మీ ప్రేమకి నేను పోటీ కాలేనయ్యా" అని చెప్పి నిన్ను నాన్న చేతిలో పెట్టింది.

ఆ తర్వాత, నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. "అక్కా.. నేను నీకు చెప్పకుండా వెళ్లిపోయాను కదా... సారీ అక్కా" అని నువ్వు అడిగిన మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ క్షణం నువ్వు నా చెల్లి మాత్రమే కాదు, నా సంతోషం, నా ప్రపంచం అని అర్థమైంది. నువ్వు కనిపించని క్షణం నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. 

కొత్తకోట వారి వీధి... మన బాల్యపు ఊయల

 ఆ ఇల్లు కేవలం ఇల్లు కాదు, అది మన కజిన్స్ తో మనమంతా కలిసి ఆడుకున్న స్వర్గం. పాతకాలపు పెద్ద ఇల్లు, దాని చుట్టూ ఉండే విస్తారమైన ప్రాంగణం... ప్రతి మూల ఒక కొత్త కథను చెప్పేది.

 నువ్వు, నేను, మన కజిన్స్.. అందరం కలిసి చేసే అల్లరి, ఆడే ఆటలు.. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తొస్తున్నాయి. 

రాత్రిపూట మేడ మీద చందమామ కింద పడుకుని నాన్నమ్మ  చెప్పే కథలు అవి కేవలం కథలు కాదు, అవి మన బంధాలను మరింత బలంగా అల్లుకున్న అపురూపమైన క్షణాలు.

నీకు గుర్తుందా, మన నాయనమ్మతో కలిసి పొందూరు నుండి ఎరుకలపేట వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ చిన్న ప్రయాణం కేవలం నడక కాదు, అది మన బాల్యాన్ని, మన కుటుంబ ప్రేమను అర్థం చేసుకున్న ఒక గొప్ప అనుభవం. దారిలో కనిపించిన పొలాలు, చిన్న చిన్న వాగులు.. అవి మనకు నేర్పిన పాఠాలు ఎన్నో. నాయనమ్మ చేతిని పట్టుకుని నడుస్తున్నప్పుడు, భయం అంటే ఏమిటో మనకు తెలిసేది కాదు.

ఆ ఊరు, ఆ జ్ఞాపకాలు

నాన్నమ్మ  కి ఎంతో ప్రేమ ఆ ఊరు. పదిహేను రోజులకోసారి అక్కడికి వెళ్లకపోతే ఆమెకు నిద్ర పట్టేది కాదు. అందుకే నాన్నకు ఏదో ఒకటి చెప్పి, మనల్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లేది. ఆ ఊరితో మన  చిన్ననాటి జ్ఞాపకాలు చాలానే ముడిపడి ఉన్నాయి.

 నాన్నమ్మ చేసే పాకుండలు మనం   తినమని చెప్పి,చాకోలెట్స్ అని చెప్పి మురిపించేది. పాలతో  ఐస్‌క్రీమ్ చేసి ఇచ్చేది. బంధువులంతా మమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకునేవాళ్లో! మామిడి తోటల్లో ఆడిన దాగుడుమూతల ఆటలు, పెదనాన్న చెప్పిన చంద్రమండలం కథలు... అన్నీ నిన్న జరిగినట్లుగా ఉన్నాయి.

వేసవి సెలవులకు అక్కడికి వెళ్లేవాళ్ళం. కానీ నువ్వు రెండు రోజులు కూడా ఉండేదానివి కాదు. రాత్రి అయితే అమ్మ కావాలని ఏడ్చేదానివి. ఆ ఏడుపు వినగానే మరుసటి రోజు నాన్న కారులో వచ్చి మనల్ని  తీసుకెళ్లేవాళ్లు.

అయినా సరే, ఆ జ్ఞాపకాలు మనసులో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆ ఊరు, ఆ బంధాలు, ఆ వెచ్చదనం... ఇవన్నీ జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు.

నాన్నకు  హిరమండలంకి ఇంజనీర్ గా బదిలీ అవడం , హిరామండలంలో మన కొత్త జీవితం మొదలైనా, మన హృదయాలు మాత్రం ఆమదాలవలసలోని ఉండిపోయాయి.మన బాల్యంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఆ ఊరిని, మన తాతగారి ఇంటిని, మన కజిన్స్ ని వదిలి వెళ్ళడం చాలా బాధగా అనిపించింది. కానీ, నాన్న ఎప్పుడూ చెప్పినట్లు, కొన్ని బంధాలు దూరం అయినా, హృదయంలో వాటి స్థానం పదిలంగా ఉంటుంది. హిరమండలంలో పెద్ద ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్ లో .. అది కేవలం ఇల్లు కాదు, అది మన కలల ప్రపంచం. వాకిట్లో ఉండే పెద్ద పూల మొక్కల గుంపు,మామిడి చెట్టు కి వేలాడిన ఉయ్యాల,ఆ ఉయ్యాల లో మన ఆటలు, ఆడుకోవడానికి వచ్చే స్నేహితులు.. ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేం. నువ్వు అంత చిన్న వయసులోనే అమ్మతో చదరంగం ఆడేదానివి. నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని, ఎంత తెలివైనదానివి నువ్వు అని. మనమిద్దరం బ్యాడ్మింటన్ నేర్చుకున్నది కూడా అక్కడే. ప్రతి ఆటలోనూ, నువ్వు నాకంటే కొంచెం ముందుండేదానివి.

శ్రీకాకుళం వెళ్ళే రోజు మాకు ఓ పండగే. అక్కడ బాబాయ్ ఇంటికి వెళ్లి, సినిమాకు వెళ్ళడం, హోటల్‌లో తినడం.. అవన్నీ చాలా గొప్ప జ్ఞాపకాలు. నాన్నకు మనకి ఏది ఇష్టమో బాగా తెలిసేది. నువ్వు ఎప్పుడూ "చికెన్ లాలీపాప్" ఆర్డర్ పెట్టేదానివి. ఆ చిన్న కోరికను నాన్న ఒక పెద్ద ఆనందంగా మార్చేవాడు.

ఒక రోజు, మనమంతా కలిసి చిరంజీవి "అంజి" సినిమా చూశాం. ఆ క్లైమాక్స్ చూసి మనం ఎంత ఆశ్చర్యపోయామో గుర్తుందా? నాన్న ఆ ఆనందం చూసి, "మళ్లీ చూద్దామా?" అని అడిగారు. అదే సినిమా, అదే రోజు, మూడు షోలు చూశాం. రాత్రి నాలుగు గంటలకు ఇంటికి వచ్చినా మన గుండెల్లో నిండిన ఆనందం ఎనలేనిది. అప్పుడే నాకు అర్థమైంది, మనకంటే ముందు మన కోరికలను, ఊహలను అర్థం చేసుకుని, వాటిని నెరవేర్చాలనే తపన నాన్న ప్రేమ అని.

నువ్వు నా వెనుక నడిచే ఆ దారి, మన చిన్న చిన్న గొడవల్లో నవ్వులు పూయించిన ఆ క్షణాలు.. అన్నీ కలిపి చూస్తే, మన బాల్యం కేవలం ఒక కల కాదు, అది మనకు లభించిన గొప్ప బహుమతి. ఆ జ్ఞాపకాలు, ఆ నవ్వులు, ఆ కన్నీళ్లు.. అన్నీ మన మధ్య ఉన్న ప్రేమకు సాక్ష్యాలు.

The story continues next week...

హిరమండలంలో జరిగిన ఊహించని సంఘటనలు, నా మనసులోని అలజడులు... అన్నీ మీతో పంచుకుంటాను.

అంత చిన్న వయసులో కుటుంబానికి దూరంగా వెళ్లిన నేను ఎక్కడ ఉన్నాను? నా వాళ్ళను తలచుకోకుండా ఏ ఒక్క క్షణం కూడా గడవలేదు. ఆ జ్ఞాపకాలే నన్ను ఎలా నడిపించాయి, ఆ కన్నీళ్లే నాకు ఎలా దారి చూపించాయి... అనేది వచ్చే వారం మీకు చెప్తాను.

Comments

  1. It's hard to read these lines.

    ReplyDelete
  2. Beautifully written sridevi, your blog took me to my childhood

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Two Blossoms, One Root

A Flash of Light, A Lifetime of Void