Two Blossoms, One Root
1993, సెప్టెంబర్ 30.
తీవ్రమైన మౌనం మధ్యలో భూమి కంపించింది .
లతూర్ భూకంపం అని వార్తలు వచ్చాయి కాసేపటికి .
కానీ మా ఇంట్లో…
అదే తెల్లవారుజామున 1:౩౦ నిమిషాలకి ,
ఒక్క చిన్న పాదం భూమ్మీద పడింది.
అది భూమిని తాకిన చప్పుడు కాదు.
అది మా జీవితాల్లో తిరుగులేని మార్పు వేసిన తొలి నినాదం.
అది నువ్వు – నా చెల్లి **దివ్య భారతి **.
అది నీవు పుట్టిన రోజు..
నా చెల్లి, నా ప్రాణం, నా దివ్య.
అప్పటి నుంచి నా గుండెలో పుట్టిన మొదటి ధ్వని నీవే.. నీవే నా హృదయధ్వని.
నువ్వు జన్మించినప్పుడు ఏడవలేదు అనడం కంటే…
ప్రపంచాన్ని చూస్తూ, “ఈ జీవితం ఎంత అందమైంది” అని ఆశ్చర్యపోయినట్టు కనిపించావు ఏమో అనిపిస్తుంది నాన్న మాటలు వింటుంటే .
"కొడితేనే ఏడ్చింది, అది కూడా ఒక్కసారి!" అంటారు నాన్న.
చిన్నగా చూసి నవ్వింది కూడా కావచ్చు – కానీ ఆ నవ్వు మా జీవితాల్ని మార్చేసింది.
నాన్న ఇప్పటికీ ఆ క్షణం గురించి మాట్లాడుతుంటారు –
నువ్వు ఇంటికొచ్చిన రోజు…
మన ఇంట్లో గోడలు సైతం నిన్ను కౌగిలించుకున్నట్టుగా అనిపించింది.
పెద్దల ప్రార్థనలు చల్లగా గాలిలో మమేకమయ్యాయి.
ఇంటికి అడుగు పెట్టగానే తలుపు తలవాల్చినట్టు ఉంది… నీ కోసం ఎంతోకాలంగా ఎదురు చూసినట్టు!
గుడిలో గంటలు మోగుతున్న శబ్దం విన్నట్టే –
నా హృదయంలో నువ్వు వచ్చిన క్షణం ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది .
ఆ రోజు…
గాలి కూడా నీ బుజ్జి పాదాల మీద ముద్దులు పెడుతూ కరగిపోయినట్టు అనిపించింది.
నీ నల్లకళ్ల లోంచి వెలిసిన మౌనపు ప్రశాంతత
ఇంటి నిండా నాట్యమాడుతూ ఉన్నట్టు అనిపించింది మా అందరికి.
అమ్మ చేతిలో నువ్వు కదులుతుంటే,
నా గుండెలో ఏదో కొత్తగా ఒకింత భయం, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ.
నా చిన్న చేతుల్లో నిన్ను తొలిసారిగా పట్టుకున్న క్షణం…
నా లోకమే మారిపోయినట్టు అనిపించింది.
ఇప్పుడు నుంచి ఈ చిన్న జీవం కోసం నేను ఉన్నాను అన్న స్పష్టత
నా చిన్న వయస్సులోనే నాకు తెలియజేసింది.
నువ్వు వచ్చాక మన ఇంట్లో
కలలకూ రంగులు వచ్చాయి,
నవ్వులకీ సంగీతం కలిగింది,
శ్వాసకూ ఒక అర్థం కనిపించింది.
అమ్మ నాకు నిన్ను ఇచ్చింది ,
కానీ నేను ఒక ప్రపంచాన్ని పొందాను.
అప్పటికి మన జీవితం సులభంగా లేదు.
lower middle class స్థితి, తక్కువ జీతం, పెద్ద కలలు.
చుట్టుపక్కల వాళ్లు తికమకగా చూసారు –
“ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచుతారు?” అని.
కానీ మన నాన్న ధైర్యంగా నవ్వుతూ అన్నాడు:
"వీరి ఇద్దరు నా మహాలక్ష్ములు!"
అంతే..
అప్పుడు మొదలైంది – మన ఇంట్లో వెలుగు క్రమంగా పెద్దదవడమూ,
నిన్ను చూస్తూ జీవితం గమ్యం మార్చుకోవడమూ.
అంతే.. ఇంట్లో వెలుగు మారింది. గాలి లో ప్రేమ గుబాళించింది.
నీ నామకరణం రోజు నాన్న నిన్ను చూసి ఆశ్చర్యపోయారు.
ఆయన సినీ ప్రేమికుడు. శ్రీదేవి, దివ్యభారతీ – ఆ రోజుల్లో ఆయన గుండెల్లో మెరిసే నక్షత్రాలు.
నిన్ను చూసినప్పుడు ఒక్కమాటే అన్నారు:
"ఇది చిన్నదివ్యభారతీ… ఇదే ఆమె పేరు."
అప్పుడు నాయనమ్మ పెద్ద చర్చలే చేసింది నీకు ఈ పేరు వద్దు అని
"చచ్చిపోయిన హీరోయిన్ పేరు ఎందుకు పెడతావ్? అనుభవం లేని పేరు!"
కానీ మా నాన్న వినలేదు.
“నాలో ఒక నమ్మకం ఉంది. ఈ పిల్ల మన ఇంటి జీవితాన్నే మార్చబోతుంది” అని నిశ్చయంగా చెప్పారు.
అలా… నువ్వు "దివ్య" అయ్యావు.
నువ్వు లతూర్ భూకంపం రోజున పుట్టినా,
మన ఇంటికి మాత్రం –
నీ చిన్న పాదమే ఓ ప్రేమ భూకంపంగా మారింది.
నువ్వు ఏడవలేదు… కానీ నేను ఏడ్చాను.
ఆ కన్నీరు లో ప్రేమ ఉంది. బాధ కాదు, భయమూ కాదు.
ఒక కొత్త బంధం –
ఒక జీవితం అంతా కాపాడాలనుకునే ప్రేమ సముద్రం .
ఈ కథ అక్కడే మొదలైంది.
ఒక్క చిన్న పాదం వేసిన రాత్రి,
ఒక్క చిన్న అక్క గుండెలో సదాకాలం నిలిచిపోయిన జ్ఞాపకం.
నీవే నా మొదటి చిరునవ్వు.
నీవే నా హృదయధ్వని.
నువ్వు అలా పుట్టిన క్షణం నుంచే – మా జీవితాల్లో దివ్యంగా నలుగురికీ వెలుగు నింపినవు.
నాకు, నీకు మధ్య వయస్సు తేడా రెండు సంవత్సరాలు, ఎనిమిది నెలలు, పదిహేడు రోజులు.
కానీ అది గణితం కాదు, బంధం.
నీవు పుట్టిన క్షణం నుంచే నేను.
ఒక అక్కను కాదు. ఒక అమ్మ గా బాధ్యతను పంచుకున్నాను.
నిన్ను వసంతోచ్చిన పువ్వులా పట్టుకున్న క్షణం.
నేనేం మాట్లాడలేదు, కానీ నా హృదయం మాట్లాడింది.
"ఇదే నా స్నేహం, ఇదే నా మర్మం, ఇదే నా ముద్దుల చెల్లి."
నువ్వు ఏడవలేదు, కానీ నాకు ఏడుపొచ్చింది.
అది ప్రేమ తడిపిన కన్నీరు – జీవితానికొక అర్థం వచ్చిన క్షణం.
నువ్వు మాతో చేరిన రోజు నుంచీ..
ఇంట్లో గోడలు కూడా నీ పేరు పలికినట్టు అనిపించేది.
చిన్న చిన్న జ్ఞాపకాలు –
నీ నవ్వు, నీ చిన్న చేతులు, నువ్వు నన్ను చూసి పొడిచిన చిన్న గిలి..
అన్నీ మిగిలిపోయాయి. గుండె లోతుల్లో.
ఇది కేవలం పుట్టుక కథ కాదు..
ఇది ప్రేమ పుట్టుక.
నీవే నా మొదటి చిరునవ్వు,
నీవే నా హృదయధ్వని.
నా జీవితం లో బదులు, నా అక్షరాల్లో బతికే నీకు..
అక్క అంటూ పిలిచినా ప్రతిసారి నా హృదయం ఆనందం తో నిండిపోయేది.
ఈ రోజు ఆ పిలుపు నా ఊపిరి లో మాత్రమే మిగిలిపోయింది.
అక్క చెల్లి ఈ అనుబంధం వెనుక ఎంత లోతు ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు.
చెల్లి అనే పిలుపులో ఎంతో బలం ఉంటుండి.
నా జీవితం ఒక పుస్తకం ఐతే అందులో తాను ఒక అందమైన అధ్యాయం.
ఆమె నవ్వు నాకు బలం,ఆమె మాటలు నాకు ధైర్యం అలంటి ఒకరోజు నా జీవితం లో ఈ అధ్యాయం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఈ కథ నా హృదయం లో మిగిలిన ప్రతి క్షణాన్ని వర్ణించేందుకు,నా బాధని అక్షరాలుగా మార్చేందుకు చేసిన ప్రయత్నం.
నా చెల్లిని ఇంకొకసారి చూడాలి అనిపించే తపన.
ఒక కోల్పోయిన బంధం గురించి కథ.ఈ కథలో సంతోషం ఉంది,బాధ ఉంది ఇంకా వీడిపోని ప్రేమ ఉంది.

Very well written, ur sister must be lucky to have a sis like you
ReplyDeleteVery well written sridevi. This shows how much love you have for your sister. Continue writing
ReplyDelete